హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 08:
బారికేడ్లతో ప్రజాస్వామ్యాన్ని బంధించలేరని, ప్రశ్నించే ఎంపీలను నిర్బంధించడం అధికార దర్పానికి నిదర్శనం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్ పై ఢిల్లీలో లోక్ సభ లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ చేస్తున్న పోరాటం పై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.
గురువారం నాడిక్కడ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఓటు చోరీ పై ఘాటుగా స్పందించారు.
రాహుల్ పోరాటాన్ని కేసులతో అణచివేయాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ భ్రమ అని,
ఢిల్లీలో రాహుల్–ప్రియాంక, ప్రతిపక్ష ఎంపీల నిర్బంధాన్ని మంత్రి ఉత్తమ్ ఖండించారు.
జంతర్ మంతర్‌కు వెళ్తున్న ఎంపీల బస్సులను అడ్డుకోవడంపై ఉత్తమ్ మండిపడ్డారు. కేసుల సంఖ్య పెంచితే ప్రజల ప్రశ్నలు తగ్గిపోతాయనుకోవడం పాలకుల పొరపాటు అని విమర్శించారు. రాహుల్ నాయకత్వం దేశవ్యాప్త ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి స్ఫూర్తి అని ఉత్తమ్ అన్నారు. ఓటు హక్కు కోసం నిలిచిన రాహుల్–ప్రియాంకల ధైర్యానికి ఉత్తమ్ అభినందనలు తెలిపారు.
ఓటర్ల జాబితాల సవరణపై అభ్యంతరాలకు ఎన్నికల సంఘం ఆధారాలతో జవాబివ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఆరోపణలను ఖండించడంతో సరిపెట్టకుండా ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని, ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులకు అనుసరించిన ప్రమాణాలను బహిర్గతం చేయాలని
ఉత్తమ్ అన్నారు.
“ఓటు చోరీ” ఆరోపణలపై స్వతంత్ర, నిష్పక్షపాత పరిశీలన జరగాలని, ఏ పార్టీ ఒత్తిడికీ లోనుకాకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయాలన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న ప్రతిపక్ష డిమాండ్‌కు సంపూర్ణ మద్దతు
తెలుపుతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని.. ప్రతి అభ్యంతరానికి సమాధానమివ్వాలని ఆయన అన్నారు. ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం మోపే వైఖరిని దేశం అంగీకరించదని మంత్రి ఉత్తమ్ చెప్పారు.





