కాప్–31లో సమతుల్య ఫలితాలకు పరస్పర గౌరవం అవసరం
వాతావరణ నిధులు, సాంకేతిక బదిలీ పెరగాలి: భూపేందర్ యాదవ్
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 8 (ట్రైనెట్ న్యూస్): వాతావరణ మార్పులపై ప్రతిష్ఠాత్మకమైన, సమతుల్య ఫలితాలను సాధించేందుకు దేశాలు సౌలభ్యం, ఆచరణాత్మక దృక్పథం, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని భారత్ పిలుపునిచ్చింది. ఫిజీలో జరిగిన ప్రీ–కాప్–31 సమావేశంలో కీలక అంశాలపై రాజకీయ ఏకాభిప్రాయం, సదస్సు ఫలితాలకు సంబంధించిన చర్చలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడారు. వాతావరణ మార్పుల ప్రభావాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రకటనలను దాటి కార్యాచరణ, సమన్వయంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
దేశాల మధ్య విభేదాల కంటే ఏకాభిప్రాయం ఉన్న అంశాలే ఎక్కువగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉండటం, పెరిగిన లక్ష్యాలకు అనుగుణంగా వాతావరణ నిధులు, సాంకేతిక బదిలీ, సామర్థ్యాభివృద్ధికి మద్దతు పెంచడం, అమలుకు ప్రాధాన్యం ఇవ్వడంపై విస్తృత సమ్మతి ఉందన్నారు. అయితే ప్రతి దేశం తన ప్రత్యేక పరిస్థితులు, అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా నిర్ణయించుకున్న మార్గాలను గౌరవించాలని వివరించారు.
వాతావరణ చర్యలను వేగవంతం చేసేందుకు వినూత్న పరిష్కారాలు, నిరంతర సంస్కరణలు అవసరమని భూపేందర్ యాదవ్ అన్నారు. ఉమ్మడి లక్ష్యాలను చేరుకునే విధానాలపై మరింత సమన్వయం సాధించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల చట్ర ఒప్పందం, పారిస్ ఒప్పందం కింద అందుబాటులో ఉన్న సాధనాలను సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు.
తాత్కాలిక అజెండాలో ఆర్టికల్ 9.1ను చేర్చడం దేశాల అవసరాలకు అనుగుణంగా నిధులను సమకూర్చే అంశంపై చర్చకు కీలక అవకాశమని మంత్రి పేర్కొన్నారు. ఆర్టికల్ 6 కింద సహకార విధానాలను వ్యూహాత్మకంగా ఉపయోగించడం ద్వారా నిధులు, ఇతర అమలు సాధనాల్లోని లోటును పూడ్చడంతోపాటు సుస్థిర అభివృద్ధికి మార్కెట్ ఆధారిత వనరులను సమీకరించవచ్చని తెలిపారు.
సాంకేతిక సహకారం, సామర్థ్యాల పెంపునకు లక్ష్యబద్ధమైన మద్దతు అందించే విషయంలో కాప్–31 స్పష్టమైన దిశను నిర్దేశించాలని భారత్ ఆశిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వాతావరణ మార్పులకు అత్యంత ప్రభావితమయ్యే దేశాలకు ప్రయోజనం చేకూర్చే సమతుల్యమైన, న్యాయసమ్మతమైన, చారిత్రాత్మక ఫలితాల కోసం బహిరంగ, పారదర్శక చర్చలకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. సమ్మిళిత భాగస్వామ్యం, సంప్రదింపులు, ఏకాభిప్రాయంతో కూడిన విధానం ద్వారా వాతావరణ బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలని సూచించారు.
ఫిజీ చర్చల్లోని నిర్మాణాత్మక అంశాలను అంటాల్యా సదస్సుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులకు అనుకూలన చర్యలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన నిధులు, సాంకేతికత, సామర్థ్యాలను అందించే ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో కాప్ అధ్యక్షత, చర్చల అధ్యక్షులు, అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
ప్రీ–కాప్–31లో విస్తృత చర్చలకు అవకాశం కల్పించిన చర్చల అధ్యక్షుడు క్రిస్ బోవెన్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్‌లో తుర్కియేలోని అంటాల్యాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు కాప్–31 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.





