Saturday10 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

6జీ అభివృద్ధికి బలపడిన అంతర్జాతీయ భాగస్వామ్యాలు

భారత్ 6జీ సదస్సులో ఐదు అవగాహన ఒప్పందాలు అందుబాటు ధర, విస్తృత సేవలే లక్ష్యం కావాలి: పెమ్మసాని

nagendra10 October 2026, 2:41 AM0 viewstrinetnews.com
6జీ అభివృద్ధికి బలపడిన అంతర్జాతీయ భాగస్వామ్యాలు

Share this story

Share link keeps your language (?lang=)

న్యూ ఢిల్లీ, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్):

భవిష్యత్ 6జీ టెలికాం సాంకేతికత అభివృద్ధిలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ మూడో అంతర్జాతీయ భారత్ 6జీ సింపోజియం–2026 ముగిసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్–2026తోపాటు న్యూ ఢిల్లీలోని ద్వారకా యశోభూమిలో భారత్ 6జీ అలయన్స్ నిర్వహించిన ఈ సదస్సులో ప్రపంచ టెలికాం సంస్థలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధకులు పాల్గొన్నారు.

ముగింపు సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్ కీలక టెలికాం సాంకేతిక దేశంగా ఎదుగుతోందన్నారు. స్వావలంబన, అంతర్జాతీయ సహకారం పరస్పరం బలపరుచుకుంటాయని పేర్కొన్నారు. దేశీయ సామర్థ్యాలు పెరిగినకొద్దీ ప్రపంచానికి మరింత బలమైన భాగస్వామిగా భారత్ నిలుస్తుందని తెలిపారు. సదస్సులో 30 మందికిపైగా అంతర్జాతీయ నిపుణులతో సహా 75 మందికిపైగా వక్తలు పాల్గొనడాన్ని అభినందించారు.

ప్రస్తుత డిజిటల్ అంతరాలను తగ్గిస్తున్న సమయంలో 6జీ మరో కొత్త అంతరానికి దారితీయకూడదని మంత్రి స్పష్టం చేశారు. అందుబాటు ధరలు, సులభంగా సేవలు పొందే అవకాశం, విస్తృత నెట్‌వర్క్ కవరేజీని ప్రారంభ రూపకల్పనలోనే చేర్చాలన్నారు. భూతల, ఉపగ్రహ నెట్‌వర్క్‌ల అనుసంధానంతో మారుమూల గ్రామాలు, దీవులు, సముద్ర ప్రాంతాలకు కూడా సేవలను విస్తరించవచ్చని వివరించారు. ఈ సాంకేతికతలను భారీ స్థాయిలో పరీక్షించి, అనుభవాలను ప్రపంచంతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.

సదస్సులో 5జీ అడ్వాన్స్‌డ్ నుంచి 6జీకి మార్పు, అంతర్జాతీయ ప్రమాణాలు, స్పెక్ట్రం, ప్రపంచ రేడియో కమ్యూనికేషన్ సదస్సు–2027, ప్రయోగాత్మక నెట్‌వర్క్‌లు, కృత్రిమ మేధ ఆధారిత సుస్థిర నెట్‌వర్క్‌లు, స్టార్టప్‌లు, పారిశ్రామిక వినియోగాలపై చర్చలు జరిగాయి. భవిష్యత్ నెట్‌వర్క్‌లలో భద్రత, సుస్థిరత, అందరికీ అందుబాటు కల్పించేందుకు సమన్వయ పరిశోధనలు, ఉమ్మడి ప్రమాణాలు, విస్తృత పరీక్షలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ సహకారం, ఉమ్మడి పరిశోధనలు, సాంకేతిక పరీక్షలు, విజ్ఞాన మార్పిడికి వీలుగా జీఎస్‌ఎంఏ, వన్‌6జీ, జీటీఐ అలయన్స్, తైవాన్‌కు చెందిన 6జీ ఇన్నోవేషన్ ఫోరం, వాయిస్ సంస్థలతో ఐదు కొత్త అవగాహన ఒప్పందాలను భారత్ 6జీ అలయన్స్ పరస్పరం మార్పిడి చేసుకుంది. 6జీ ఉమ్మడి సూత్రాల పురోగతి నివేదికతోపాటు పది శ్వేతపత్రాలు, నివేదికలను విడుదల చేసింది.

అక్టోబరు 27 నుంచి ఎస్టిక్–2026

ముగింపు సమావేశంలో టెలికమ్యూనికేషన్ల విభాగం ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్‌ (ఎస్టిక్)–2026 వివరాలను వెల్లడించింది. అక్టోబరు 27 నుంచి 29 వరకు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం మార్గదర్శకత్వంలో, 12 శాఖలు, మంత్రిత్వ శాఖల సహకారంతో సీఎస్‌ఐఆర్ నిర్వహించనుంది. తొమ్మిది అంశాలపై సాంకేతిక సమావేశాలు, ప్రదర్శనలు, స్టార్టప్‌ల ప్రజెంటేషన్లు, వ్యాపార–ప్రభుత్వ అనుసంధాన సమావేశాలు ఇందులో ఉంటాయి.

అక్టోబరు 28న టెలికమ్యూనికేషన్ల విభాగం ఆధ్వర్యంలో ‘ఇంటెలిజెంట్ నెట్‌వర్క్‌లు–క్వాంటం కమ్యూనికేషన్’పై ప్రత్యేక సమావేశం జరగనుంది. భవిష్యత్ డిజిటల్ మౌలిక వసతులు, సురక్షిత సమాచార వ్యవస్థలపై నిపుణులు చర్చించనున్నారు. సీ–డాట్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ సమన్వయంతో జరిగే చర్చలో ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఢిల్లీ, హెచ్‌ఎఫ్‌సీఎల్, రిలయన్స్ జియో, భారత్ 6జీ అలయన్స్ ప్రతినిధులు పాల్గొననున్నారు.

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →