శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,38,315/10g+0.14%
భాషలు

తాజా వార్తలు

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది

Telangana government is working sincerely to resolve auto drivers' issues, promising fare hikes based on a committee report, a welfare board, and financial aid for retrofitting.

nagendra8 September 2026, 1:43 AM1 చూసులుtrinetnews.com
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలం కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు అమలు

లాస్ట్ మైల్ కనెక్టివిటీ లో భాగంగా ఆర్టీసీ ఈవీ ఆటో లు నడిపే ప్రసక్తే లేదు ఇది దుష్ప్రచారం మాత్రమే

ఓలా, ఉబెర్ తరహా లో ప్రభుత్వమే యాప్ ప్రవేశపెట్టడానికి ఐటీ శాఖ తో సంప్రదింపులు జరిపాం

హైదరాబాద్‌లో 18,700 ఆటోలకు రెట్రోఫిట్మెంట్ కోసం రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం

ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించి శాసన సభ లో బిల్లు ప్రవేశపెడతాం - ఆటో కార్మిక సంఘాల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి

హైదరాబాద్, ట్రైనెట్, సెప్టెంబర్ 7:

రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి తెలిపారు. ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి కీలక సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాలు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురాగా.. ఆయా అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు.

సమావేశంలో కీలక నిర్ణయాలు, అంశాలు

ఈవీ ఆటోలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ పాలసీ తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదన్నారు.

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కార్మిక శాఖతో కలిసి ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి శాసనసభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆటో ఛార్జీల పెంపునకు సానుకూల నిర్ణయం

2012 తర్వాత ఆటో ఛార్జీలను పెంచలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆటో ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని చెప్పారు. ఎంత మేర ఛార్జీలు పెంచాలనే అంశాన్ని కమిటీ నిర్ణయించి ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని, ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపును అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వ ప్రత్యేక యాప్

ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందించే అంశంపై ఇప్పటికే ఐటీ శాఖ మంత్రికి లేఖ రాశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

పెండింగ్, తిరస్కరించిన పర్మిట్లకు పరిష్కారం

జీఓ ఎంఎస్ నం.263 కింద తిరస్కరించబడిన కేసులు, గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన ఆటో రిక్షా పర్మిట్ కోటాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అగ్రిగేటర్ పాలసీపై అధ్యయనానికి కమిటీ

అగ్రిగేటర్ల ద్వారా వైట్ ప్లేట్ వాహనాల వినియోగంపై ఆటో సంఘాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన అగ్రిగేటర్ పాలసీలో ద్విచక్ర వాహనాలను ఉపయోగించుకునే అవకాశం ఉందని, దీనివల్ల నిరుద్యోగ సమస్యను కొంతవరకు తగ్గించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో అగ్రిగేటర్ పాలసీపై రవాణా శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఇతర జిల్లాల ఆటోలపై నిబంధనల అమలు

ఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆటో సంఘాలు కోరాయి. దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హామీ ఇచ్చింది. నిబంధనల అమలులో నగర ఆటో కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.

సారథి పోర్టల్‌లో ఆటో లైసెన్స్ సమస్యకు పరిష్కారం

సారథి పోర్టల్‌లో ఆటో రిక్షా డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీకి సంబంధించి స్పష్టత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఎంవీ (లైట్ మోటార్ వెహికల్) లైసెన్స్ ఉన్న వారికి ఆటో నడిపే విషయంలో ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో 18,766 ఆటోలకు రెట్రోఫిట్మెంట్ కోసం ఆర్థిక సహాయం

హైదరాబాద్ నగరంలో డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆటోలను రెట్రోఫిట్మెంట్ చేసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని సుమారు 18,700 ఆటోలకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఈ కార్యక్రమం కోసం వివిధ శాఖల సమన్వయంతో సుమారు రూ.200 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బీమా పాలసీ పై

ఆటో డ్రైవర్ల ప్రమాద, సహజ మరణ బీమా అంశంపై కార్మిక శాఖతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్లతో పాటు ఇతర వర్గాలకు కూడా భరోసా కల్పించేలా ప్రత్యేక బీమా పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించేలా ఇందిరమ్మ పాలసీ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో ఆటో కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణ, కార్మిక శాఖ అధికారులు, పోలీస్, ట్రాఫిక్ అధికారులు, వివిధ ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →